హైదరాబాద్ యువత మత్తుకు బానిస అవుతున్నారు.ఓ వైపు మత్తుకు వ్యతిరేకంగా నగర పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుంటే కొందరు అక్రమార్కులు గుట్టుగా గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. కొత్తగా ఓజీ పేరిట గంజాయిని మార్కెట్లోకి వచ్చింది. ఇది సేవిస్తూ పట్టుబడిన కొందరు యువకులు దీని గురించి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
ఈ ఓజీ గంజాయిని డార్క్ నెట్ ద్వారా బుకింగ్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులకు చిక్కిన నలుగురు యువకులు చెప్పారు. డార్క్ నెట్ ద్వారా ఈ ఓజీ గంజాయిని విక్రయించే వారి వివరాలను సేకరించి సిగ్నల్ యాప్, స్నాప్ చాట్ యాప్ ద్వారా ఆర్డర్ ఇస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ యాప్‌ల ద్వారా యూజర్ ఐడీలకు మాస్క్ వేయడంతో వారి ఆచూకీ దొరకడం అసాధ్యమని తెలుస్తోంది. అదే విధంగా ఈ యాప్‌లలో ఒకసారి మెసేజ్ చేసిన తర్వాత దానిని సంబంధిత వ్యక్తి చూడగానే అది మాయమైపోతుందని సమాచారం. ఆ తర్వాత యాప్‌ను తనిఖీ చేసినా ఏం మెసేజ్ పెట్టామని ఎవరూ తెలుసుకోని విధంగా క్రిమినల్స్ టెక్నాలజీని వాడుతున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో ఓజీ గంజాయి వ్యవహారం బయటపడింది.