“నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని.. ఈ ప్రభుత్వంలో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాది” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మాదాపూర్ లోని దస్పల్ల హోటల్ లో జరిగిన గ్లోబల్ మాదిగ డే -2024 కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదని.. న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అమలు చేయడంలో కొంత ఆలస్యం కావచ్చు.. కానీ మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు.
మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకరుంటామని ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉప కులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామన్నారు. వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంలో రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి క్రియాశీల పాత్ర పోషించిందన్నారు.