తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంటోంది. పగటి పూట భానుడు భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు సాయంత్రంపూట వరణుడి పులకింతతో కాస్త సేదతీరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక ఏప్రిల్ నెలలోనే భానుడు మే నెలను తలపించేలా భగభగమనిపిస్తున్నాడు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలకు ఏదైనా వస్త్రాన్ని ధరించి వెంట నీళ్ల సీసా తీసుకెళ్లాలని చెబుతున్నారు.