భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారామ ప్రాజెక్టు సూపర్ పాసేజు పిల్లర్ కూలిపోయింది. ఈ ఘటన జరిగి 10 రోజులు గడిచినా అధికారులు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదు. కాల్వకు ఏర్పాటు చేసిన సైడ్ రివిట్మెంట్ దెబ్బతినడంతో ఈ విషయం బయటకు రానీకుండా అధికారులు మరమ్మతులు చేయిస్తున్నారు.
పశువుల కాపరులను ఆ మార్గం గుండా వెళ్లకుండా అడ్డుకోవడంతో తాజాగా ఈ వ్యవహారం బయటపడింది. సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన పిల్లర్ కూలిపోవడంతో దాని నాణ్యత ప్రమాణాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాలువలో నీరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఒకవేళ నీరు ప్రవహించి ఉంటే మొత్తం కూలిపోయే అవకాశం ఉండేదని నిపుణులు అంటున్నారు. ఇక కాల్వలో పడిపోయిన పిల్లర్‌ను తిరిగి నిర్మించేందుకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుందని, ఈ బాధ్యతను గుత్తేదారుకు అప్పగించినట్లు ఓ అధికారి చెప్పినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది.