తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా శాంతించిన భానుడు, మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు 2 నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకు అధిక ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
గురువారం నుంచి కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు మూడు రోజుల పాటు యెల్లో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ బారిన పడకుండా ఉండేందుకు పళ్లరసాలు, ఓఆర్ఎస్ ద్రావణాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.