కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించామని తెలిపారు. ముఖ్యంగా కృష్ణా నదీ నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై చర్చించినట్టు తెలిపారు. కృష్ణా జలాలను ఏపీ ఎక్కువగా వినియోగిస్తుందని తక్షణమే చర్యలు తీసుకోవాలని పాటిల్ ను కోరాం.
కృష్ణా జలాల్లో కేటాయించిన దానికంటే ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి
చేశామన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బంకచర్ల పై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా త్వరగా అందించాలని కోరామన్నారు. అదేవిధంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విన్నవించామని, వీటిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ వెల్లడించారు.