తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఆదివారం రోజున పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఉన్న శ్రుతి ఓజాను బదిలీ చేసి ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్‌గా, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా నియమించారు. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శిగా ఎఫ్‌ఏసీగా విధులు నిర్వహిస్తున్న నవీన్ మిత్తల్‌ను రిలీవ్ చేశారు.
ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ను రవాణాశాఖ కమిషనర్‌గా నియమిస్తూ.. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్‌ను ఎక్సైజ్ కమిషనర్‌గా బదిలీ చేశారు. శ్రీధర్‌కు టీఎస్‌ఐఐసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హొళికెరిని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పొట్రుకు రంగారెడ్డి కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌గా టీఎస్‌ఐఐసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి దేవేందర్ సింగ్ చౌహాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.