రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ జరగడం లేదని సీపీఐ తెలంగాణ రాస్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అంటున్నారు. వాటిని పరిష్కరించి రుణమాఫీ అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమి కొత్తగా లేదని అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి 14 శాతం నిధులు కేటాయించాలని అడిగాము. కానీ 8 శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు.
నిధుల కొరత ఉందని.. కొన్ని రంగాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని సాకులు చెప్పడం కాకుండా ఉన్న బడ్జెట్ ను ఎలా వినియోగించాలనే అంశం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని.. ఎక్కువ హామీలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. గతం కంటే సజావుగా అసెంబ్లీ జరిగిందని.. కూనంనేని పేర్కొన్నారు.