తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకపూరిత నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం ఒక పెద్ద హరిత ప్రాంతాన్ని కోల్పోనుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కంచె-గచ్చిబౌళిలో 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ భూమిలో ఎలాంటి జంతుజాలం లేదని అసెంబ్లీ రేవంత్ రెడ్డి తప్పుగా పేర్కొన్నారని.. ఆ ప్రాంతంలో 700కుపైగా పుష్ర, వృక్ష జాతులు, 10 రకాల సస్తన ప్రాణులు, 15 రకాల సరీసృపాలు, 200పైగా పక్షి జాతులు నివసిస్తున్నాయని విద్యార్థులు, అధ్యాపకుల నివేదిక తెలుపుతోందని అన్నారు.
“ఇది కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఓ విపరీతమైన నిర్ణయం. ఓ వైపు ప్రకృతి రక్షణ అంటూ మాట్లాడుతూ మరోవైపు ప్రకృతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భూమిని వాణిజ్య కేంద్రంగా మార్చేందుకు, భారీ భవనాలు, షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇది హైదరాబాద్ నగర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఈ అవివేకపు విధానాన్ని వెంటనే విరమించుకోవాలి అని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.