భవిష్యత్తులో లగచర్ల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుంది, రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుంది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల సమస్యల నుంచి మొదలుకొని అన్ని వర్గాల సమస్యలపై, అలాగే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చ పెట్టాలన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నక్క వినయాలు ప్రదర్శించి, అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ నుంచి మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కాడు. రైతు రుణమాఫీ ఇప్పటి వరకూ 100% పూర్తవలేదు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లె లేదా తెలంగాణలోని ఏ గ్రామమైనా ఈ సవాళ్లకు సిద్ధమని చెబితే, ముఖ్యమంత్రి పారిపోయాడు. తెలంగాణలో 30% కూడా రైతు రుణమాఫీ కాలేదు. అయినా కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు.