తెలంగాణలో మెరుపు సమ్మెకు దిగుతున్నారు జూడాలు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (T-JUDA) ఈ రోజు వైద్య విద్యా డైరెక్టర్ DMEడాక్టర్ వాణీ కలిసి అధికారిక సమ్మె నోటీసును సమర్పించింది. గత నెలలో తాత్కాలికంగా నిలిపివేసిన సమ్మెను తిరిగి కొనసాగించడానికి ఈ చర్య తీసుకున్నామని అంటున్నారు జూడాలు.
గత సమ్మె నోటీసుకు స్పందనగా కొన్ని ప్రతిపాదనలు రావడం జరిగినప్పటికీ, మా డిమాండ్లలో ఒక్కటీ పూర్తిగా నెరవేర్చబడలేదని ఫైర్ అవుతున్నారు జూడాలు. గత సమ్మె సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఏ ప్రభుత్వ ఆర్డర్ జారీ చేయబడదని మాకు తెలియజేయబడిందని వివరించారు. ఎన్నికల కోడ్ కాలం ముగిసే వరకు మా సమ్మెను నిలిపివేయమని మాకు సూచించబడింది.
గత నోటీసు జారీ అయినప్పటి నుండి దాదాపు ఒక నెల గడిచింది, అయినప్పటికీ మా డిమాండ్లను తీర్చడానికి ఎటువంటి ప్రధానమైన పురోగతి జరగనందున తిరిగి సమ్మెను ప్రారంభించడానికి తప్పని పరిస్థితిని కలిగించిందని వివరించారు. కాబట్టి, 24.06.2024 నుండి మా సమ్మె తిరిగి ప్రారంభించి నిరవధికంగా కొనసాగుతుందని ప్రకటిస్తున్నాము, మా అన్ని డిమాండ్లు పూర్తిగా నెరవేర్చబడేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు.