2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఎన్నికల ఫలితాలను ఊహించలేక పోయిన మాజీ సీఎం జగన్ ఇన్నిరోజులు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కానీ మంగళవారం ట్విట్టర్ ఖాతాలో ఈవీఎం మిషన్ల కంటే.. బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహించాలని.. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్లనే ఉపయోగిస్తున్నారని జగన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. దీంతో ఆయన ఓటమి చెందడంతో ఈవీఎంలపై పరోక్షంగా బురదచల్లారు.
జగన్ ట్వీట్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు మీ విజయమా.. ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైతే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ కు దమ్ముంటే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని.. బ్యాలెట్ విధానంలోనే ఉప ఎన్నికల పెట్టాలని ఈసీని కోరదామని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో జగన్ కు గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కూడా రాదని.. పులివెందుల ప్రజలే ఆయనను ఓడిస్తారని.. జగన్ ఇకనైన చిలక జోస్యం చెప్పడం ఆపాలని బుద్దా వెంకన్న సూచించారు.