హైదరాబాద్ యూనివర్సిటీలోని 400 ఎకరాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హెచ్సీయూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీలకు ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చారు. HCUలోని 400 ఎకరాలు అమ్మడం ఆపేయాలని, లేకపోతే చట్టపరంగా, రాజకీయపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తాజాగా TGIIC కీలక ప్రకటన చేసింది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు తెలిపింది. తాము చేపట్టిన సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీకి చెందినట్లు రుజువు కాలేదని స్పష్టం చేసింది. దీనిపై HCU స్పందిస్తూ.. TGIIC చేసిన ప్రకటనను ఖండించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెవెన్యూ అధికారులు జులై 2024లో HCU ప్రాంగణంలోని 400 ఎకరాలలో ఎటువంటి సర్వే నిర్వహించలేదని.. ఇప్పటివరకు భూమికి చెందిన స్థలాకృతిని మాత్రమే ప్రాథమికంగా తనిఖీ చేశారని స్పష్టం చేసింది.