తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేదరు. ఎప్పుడు ఎవ్వరూ రివర్స్ అవుతారో ఏమీ అర్థం కావడం లేదు నిన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న వాళ్లు కూడా సడెన్‌గా మిత్రులైపోయి నవ్వుతూ, తుల్లుతూ మాట్లాడుకుంటూ ప్రజలను ఆశ్చర్యంలో ముచెత్తుతున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విషయంలోనూ అదే జరిగింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఈ ఇద్దరు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోగా.. ఇవాళ కలిసిపోయారు. ఇద్దరూ ఒకే వేదికపై కలుసుకోవటమే కాదు.. పక్క పక్కనే కుర్చుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకున్నారు.
ఈ ఆసక్తికర సన్నివేశం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున:ప్రతిష్ఠ కార్యక్రమంలో జరిగింది. వల్మిడి సీతారాముల ఆలయం పున:ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి జరిపిస్తుండగా.. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా హాజరయ్యారు. ఈ వేడుకకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై అప్పటికే మంత్రులు, ఇతర నేతలు ఆసీనులై ఉండగా.. మంత్రి సత్యవతి రాథోడ్ పక్కన రెండు కుర్చీలు మాత్రమే ఖాళీగా కనిపించాయి. దీంతో.. గత్యంతరం లేక ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చోవాల్సి వచ్చింది. అక్కడితో అయిపోలేదు.. ఇద్దరూ ఒకరినొకరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. చిరునవ్వుతో కుశల ప్రశ్నలు కూడా వేసుకున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశం.. అక్కడి బీఆర్ఎస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది.