ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టడం వెనక ఉన్న కారణాన్ని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. కల్యాణలక్ష్మి ఆలోచనకు వరంగల్ జిల్లాలో జరిగిన ఓ ఘటన కారణమని వివరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున అందించే ఆర్థికసాయం చెక్కులను కవిత పంపిణీ చేశారు.
“తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌లోని ఓ తండాలో కేసీఆర్ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి బిడ్డ పెళ్లికి దాచిన సొమ్ము కాలిపోయిందని చెప్పారు. ఆనాడు కేసీఆర్ రూ.50వేలు సేకరించి ఆయనకు సాయం చేశారు. కులమతాలకు అతీతంగా పేదవారికి సాయపడాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ఆనాడే నిర్ణయించుకున్నారు. లబ్ధిదారులకు అందించే సాయాన్ని రూ.50వేలతో ప్రారంభించి ఇప్పుడు రూ.లక్షకు పెంచారు. ఆయా కుటుంబాలకు ఇది ఎంతో కొంత ఆసరా అవుతుంది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం లేదు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు అమలవుతోందనేది ప్రజలంతా ఆలోచించుకోవాలి.” అని కవిత తెలిపారు.