తెలంగాణ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఓవైపు తమ పార్టీ కేడర్‌ను బలపరుచుకుంటూనే మరోవైపు ఇతర పార్టీల వైఫల్యాలపై ఫోకస్ పెట్టాయి. అలా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య ట్వీట్ వార్ జరిగింది. ‘అప్పుడు దిల్లీ, ఇప్పడు దిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు’ అని రేవంత్‌రెడ్డి తాజా పర్యటనను ఎద్దేవా చేస్తూ ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌లో పోస్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం.. దిల్లీ గల్లీల్లో మోకరిల్లడమని విమర్శించారు.
దీనికి కౌంటర్‌గా.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ‘గల్లీలో సవాళ్లు.. దిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోలు’ అని ట్వీట్ చేశారు. మోదీకి కేసీఆర్ నమస్కరిస్తున్న ఫొటోను ఆయన జత చేశారు.
🔥గల్లీలో సవాల్లు…
ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు…ఇది కేసీఆర్ మ్యాజిక్కు..
జగమెరిగిన 'నిక్కర్'…లిక్కర్… లాజిక్కు
#BRSBJPBhaiBhai #ByeByeKCR https://t.co/aP6c7reEe6 pic.twitter.com/KH8gJy0rfG— Revanth Reddy (@revanth_anumula) September 2, 2023