తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్.. మొదటగా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఇవాళ, రేపు అభ్యర్థులకు బీ ఫారాలు అందజేస్తామని తెలిపారు. ఒక్కొక్క అభ్యర్థికి రెండు బీ ఫారాలు అందజేస్తామని.. వాటిని నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
“కొన్నిచోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చాం. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయి. ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమే. ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం. అందరూ నాయకులను కలుపుకుని పోవాలి. మన నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారు. మనవాళ్లు గెలిచినా సాంకేతికంగా ఇబ్బంది పెడతారు. వనమా వంటి నాయకుల విషయంలో అలా జరిగింది. సందేహాలు ఉంటే మన న్యాయ బృందాన్ని సంప్రదించండి. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు.” అని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేశారు.