ఈనెల 12న తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి రాత్రికి ఢిల్లీకి పయనం కానున్నారు. కెసిఆర్ ఢిల్లీ పర్యటనపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి మోడీప్రధానమంత్రి మోడీ సార్లు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కలవలేదని మండిపడ్డారు. కెసిఆర్ కి అహంకారం పెరిగిపోయిందన్నారు విజయశాంతి.
” ప్రధానమంత్రి మోడీ గారు మూడు సార్లు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కలవలేదు. కనీస మర్యాద ఇవ్వలేదు. కేసీఆర్‌కు అహంకారం పెరిగింది. ఆయన మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. రాజకీయ కారణాలతో రామగుండంలో ప్రధాని మోడీ గారి సభను అడ్డుకుంటామని కొన్ని పార్టీలు ప్రకటించడం సిగ్గు చేటు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న ప్రధానిని అడ్డుకోవడమేంటి..? రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ తో రైతుల్లో భరోసా పెరిగింది. ఎలాంటి కొరత లేకుండా ఎరువులను పొందేందుకు అవకాశం వచ్చింది.
12.5 మిలియన్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణలో యూరియా కొరత తీరుతుంది. గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు అలాంటి సమస్య ఉండదు. రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభం కానుండడంతో రైతుల్లో భరోసా నిండింది. 12న ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి” అని సోషల్ మీడియా వేదికగా కోరారు విజయశాంతి.