26 రాష్ట్రాల రైతు సంఘాలతో కేసీఆర్‌ సమావేశం..బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ… ‘‘ఒకనాడు బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి అనేక పోరాటాల ద్వారా స్వాతంత్ర్యం లభించింది. చైతన్యంతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న ఏ దేశమైనా, ఏ సమాజమైనా ఆ పోరాట చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తూ తమ స్వయంపాలనలో ప్రజల అభివృద్ధి కోసం భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ తమ దేశాల చట్టాలను, పాలనా వ్యవస్థలను రూపొందించుకుంటాయి. ఆయా సమాజాల స్వయంపాలనా ప్రారంభకాలంలో బుద్ధిజీవులు నాయకత్వం వహిస్తారని వివరించారు.

తమ ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో సర్వానుమతి తీసుకొని పాలనను ప్రారంభిస్తారు. కానీ, మొదటి దశలోనే పరిపాలన సంపూర్ణంగా ఉండకపోవచ్చు. రానురాను బాలారిష్టాలను దాటుకుంటూ పాలన అనుభవాలను, కార్యాచరణను క్రోడీకరించుకోవడం ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో పాలనను 80 శాతం వరకు విజయవంతంగా గాడిలో పడుతుంది. తద్వారా ఆ దేశ ప్రజలయొక్క జీవితాలు గుణాత్మకంగా అభివృద్ధి సాధిస్తాయి. మిగిలిన కొద్దిశాతం పాలన కూడా మరికొద్దికాలంలో చక్కబడి, పరిపూర్ణత సాధించుకుంటుంది.ప్రపంచంలో సైన్సు, సాంకేతిక అభివృద్ధి పెరుగుతున్నకొద్దీ ఆయా సమాజాల్లో నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి. అట్లా సాంకేతికత పెరుగుతున్నాకొద్దీ.. పాలనలో పరిపూర్ణత వస్తుంది. మానవ జీవితం ఉన్నంతకాలం ఈ పరిణామ క్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది.’’ అని అన్నారు.

‘‘ అయితే, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. స్వాతంత్ర్య పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం ఎందుకో మనందరం ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడంలేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో మనందరం చర్చించుకోవాల్సిన సందర్భం ఇది.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version