తుగ్లక్‌ రోడ్‌ నివాసంతో కేసీఆర్​కు తెగిన 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు దిల్లీలోని 23, తుగ్లక్‌ రోడ్‌లో ఉన్న అధికార నివాసంతో దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది. 2004లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తరఫున కరీంనగర్‌ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్‌.. మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్‌ రోడ్‌లోని టైప్‌ 8 క్వార్టర్‌ను ప్రభుత్వం కేటాయించింది.

2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసి. ఉపఎన్నికలో మళ్లీ ఎంపీగా నెగ్గినప్పుడు.. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికైనప్పుడు అదే క్వార్టర్​లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దిల్లీలో సీఎంలకు అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. ఈ క్రమంలో 2014లో కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన సమయంలో  అదే నివాసాన్ని కేసీఆర్‌కు కేటాయించింది. మరోవైపు నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్‌ కుమార్తె కవిత సైతం ఆ నివాసాన్నే తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. అలా ఆ క్వార్టర్‌ ముఖ్యమంత్రికి, ఎంపీ కవితకు.. అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్‌ రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యాక అదే నివాసాన్ని కొనసాగించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేయగా.. దిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయడానికి రెండుమూడు రోజులు సమయం కావాలని అధికారులకు బీఆర్ఎస్ తెలిపినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news