కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సికింద్రాబాద్ అగ్నిప్రమాదస్థలిని పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డెక్కన్ నిట్వేర్ ఘటనలో మంటల ధాటికి పక్కనే కాలనీలో దెబ్బతిన్న ఇళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయ శిబిరంలో ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడారు.
అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు గుర్తించలేదన్న కేంద్ర మంత్రి… జనావాసాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో నిర్వహిస్తున్న వేర్హౌజ్లు, గోడౌన్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని నగరం వెలుపలికి తరలించాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు గుర్తించలేదని, మంటల ధాటికి కాలనీలో దెబ్బతిన్న జనావాసాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
మరోవైపు సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురు ఆచూకీ గల్లంతుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆచూకీ లేని ముగ్గురు గుజరాత్ కూలీల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. మిస్ అయిన జునైద్, వసీం, జహీర్ కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించారు. కాలిపోయిన భవనంలోనే ఈ ముగ్గురి సెల్ సిగ్నల్ చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భవనం లోపలే ఉంటే మృతదేహాలు కాలి బూడిదై ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.