తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇవాళ జరిగిన స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీకి డుమ్మా కొట్టారు కోమటిరెడ్డి. ఇంత కాలం పార్టీనే తన తొలి ప్రాధాన్యతగా చెబుతూ వస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు ఆత్మగౌరవం ముఖ్యమంటూ స్వరం మార్చడం గమనార్హం.
ఆయన అలగడానికి సరైన కారణం ఏంటో మాత్రం తెలియదు. కీలక పదవులు దక్కకపోవడం పై తీవ్ర అసహనానికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ బుజ్జగింపులకు రంగంలోకి దిగింది. ఏఐసీసీ ఆదేశానుసారం ఏసీసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసినట్టు సమాచారం. సమస్యలను అంతర్గతంగానే, సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో తనను కలవాలని సూచించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ మాణిక్ రావు ఠాక్రె, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్తారని అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డిని బుజ్జగిస్తారని తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి స్ట్రాంగ్ లీడర్ అని.. ఆయన అలగరు అని సీనియర్ నేత భట్టి విక్రమార్క చెప్పడం గమనార్హం.