తెలంగాణ అటవీశాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆమెకు అటవీశాఖ పథకాలు, పనులపై సంరక్షణ అధికారి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఫారెస్ట్ లో జంతువుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా తొలి సమీక్షలో పరిహారం పెంపుపై మంత్రి సంతకం చేశారు.
పరిహారం రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తెచ్చేందుకు అనుమతిస్తూ మరో సంతకం చేశారు. అటవీ, దేవాదాయ శాఖల్లో ఖాళీల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. అటవీ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.