నాకు ప్రమాదం జరగడం.. మంచి శకునమే అన్నారు మంత్రి కేటీఆర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా తనకు జరిగిన ప్రమాదంపై మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ప్రమాదము ఒకవిధంగా మంచి శకునంగానే భావిస్తున్నానన్నారు. ఎందుకంటే 2014లోనూ ఇలాంటిదే జరిగిందని, అప్పుడు ఎన్నికల్లో తాను గెలిచానని, ఇప్పుడు కూడా గెలవబోతున్నానని కేటీఆర్ అన్నారు.
ప్రమాదంలో తాను కింద పడిపోకుండా గన్ మెన్ సహాయం చేశారని మంత్రి వెల్లడించారు. అలాగే కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానిది 5 గంటల ఫెయిల్యూర్ మోడల అయితే తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ది 24 గంటల పవర్-ఫుల్ మోడల్ అని అన్నారు. పదేళ్ల ప్రస్థానం తర్వాత ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన తమదని.. అధికారంచేపట్టి 6 నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం హస్తం పార్టీదని విమర్శించారు.