ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్).. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్యే కొత్త హైదరాబాద్ వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వెలుపల సూర్యాపేట వంటి జిల్లా కేంద్రాలను కలుపుతూ మరో రింగ్‌రోడ్డు రావాలని.. దీంతో రహదారి నెట్‌వర్క్ మెరుగుపడి హైదరాబాద్‌కు రవాణా సులభతరం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరింత పరుగులు పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కేటీఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలోనూ ప్రతి రోజూ మంచినీళ్లు ఇవ్వాలనేది తన కల అని.. మున్ముందు 24 గంటలూ ఇస్తామనే విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు. సోషల్ ఇన్‌ఫ్రా పెంచాల్సి ఉందని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వంతోనే ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ పెరిగిందని చెప్పారు. రెండు దఫాలు సాగు, తాగు నీరు, కరెంటు సమస్యల పరిష్కారంపై ఎక్కువ వ్యయం చేశామని.. మూడోసారి రాగానే హైదరాబాద్ అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నామని స్పష్టం చేశారు.