జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన్నెగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చేనేత కార్మికులందరికి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నకు బీమాను ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. చేనేత హెల్త్ కార్డులను ఇస్తున్నామని.. ఔట్ పెషెంట్ చేనేతలకు ఇక నుంచి రూ.25 వేలు అందుతాయని చెప్పారు. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టామని తెలిపారు.
‘కొత్తగా 16 వేల పైగా కొత్త మగ్గాల ఇవ్వబోతున్నాం. చేనేతలకు ప్రభుత్వమే ఉచితంగా గుర్తింపు కార్డులు ఇస్తుంది. టెస్కో పరిమితిని రూ.25 వేలకు పెంచుతున్నాం. చేనేత మీద 5% జీఎస్టీ వేసిన నేత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా కేంద్రం తీరు ఉంది. కేసీఆర్ ఎప్పుడు… ‘టాటాలు మాత్రమే కాదు.. తాతలు మెచ్చిన కుల వృత్తులు ఉంటేనే అభివృద్ధి’ అంటూ ఉంటారు. నేతన్నల కోసం చేనేత మిత్ర వంటి అనేక కార్యక్రమాలు తెచ్చాం. చేనేత మిత్రా పథకంలో భాగంగా ప్రతి మగ్గానికి నెలకు 3 వేల రూపాయలు సబ్సిడీ అకౌంట్లో వేస్తాం. ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఇది అమల్లోకి వస్తుంది.’ అని కేటీఆర్ అన్నారు.