ఐటీ రంగంలో.. భవిష్యత్ టైర్ 2 నగరాలదే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పదేళ్లలో హైదరాబాద్, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదని చెప్పారు. వరంగల్‌లోనే కాదు భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలని ఆకాక్షించారు. హనుమకొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నాను. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను.బెంగళూరు ఐటీ రంగంలో 40శాతం తెలుగువాళ్లే. బెంగళూరు నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధం. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కాలి. కులం, మతం పేరుతో కొట్టుకుచావడం మానాలి. అని కేటీఆర్ అన్నారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ హనుమకొండ , కాజీపేట , వరంగల్‌లో 900 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ. 26.13కోట్లతో 15 ఎం ఎల్ డి సామర్థ్యంతో నిర్మించిన మురుగు నీటి శుద్దీకరణ కేంద్రం, కాజీపేట నిట్ వద్ద 30 లక్షలతో ముస్తాబైన కూడలిని ప్రారంభించారు. మడికొండ ఐటీ పార్కులో 40కోట్లతో ఏర్పాటుచేసిన క్వాడ్రంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీని కేటీఆర్ ప్రారంభించారు.