గత కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం గురించి, ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ తీసుకువచ్చిన కార్యక్రమాల గురించి పోస్టు పెట్టారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పి ఆ మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాత కోసం పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. “దేశంలోని తొలిసారి కేసీఆర్ హయాంలో రైతుబంధు అమలు చేశాం. 70లక్షల మంది రైతులకు 73వేల కోట్ల రూపాయలను ఖాతాల్లో వేశాం. ప్రతి రైతుకు రైతుబీమా పేరుతో 5లక్షల రూపాయల జీవిత బీమా కల్పించాం. 25వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ అమలు చేశాం. 24గంటల ఉచిత విద్యుత్ అందించాం. మిషన్ కాకతీయలో భాగంగా వేల చెరువులను పునరుద్ధరించిన ఘనత కూడా కేసీఆర్‌దే. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించాం” అని కేటీఆర్ తెలిపారు.