అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో ఎన్నికలకు రెడీ అవుతోంది. పార్టీలో ఇన్నాళ్లు ఉన్న విభేదాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఐక్యతారాగం పాడుతోంది. అంతా సర్దుకుందనుకుంటున్న సమయంలో భువనగిరి జిల్లాలో ముసలం మొదలైంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో వర్గపోరు నెలకొంది.
తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి చేస్తోంది తప్పని అన్నారు. ఈ మేరకు పట్ణణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేసి.. బహిరంగ విమర్శలు గుప్పించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇబ్బందులు ఉన్నాయని అనిల్ కుమార్ అన్నారు. అందుకే కార్యకర్తల సమావేశం నిర్వహించానని.. తన ఇంట్లోనే ఐదారు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు బీసీలకే భువనగిరి టికెట్ ఇవ్వాలని సమాంతరంగా సమావేశాలు పెడుతూ పార్టీ క్యాడర్‌ను డిస్టర్బ్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.