తెలంగాణ లో ఏడాది కాలంగా కౌరవ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొడంగల్ లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కొడంగల్ కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమి లేదని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఆయన అల్లుడికి భూములు ఇవ్వడానికి లగచర్ల, హకీంపేట రైతులను ఇబ్బందులు పెడుతున్నాడు. ఇల్లు దాటని లంబాడి ఆడబిడ్డలకు ఇబ్బందులు పెడితే, ఢిల్లీకి వెళ్లి సమస్యలు చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పని చేయడం లేదు. అనుముల అన్నదమ్ములు, అదానీ కోసమే పని చేస్తున్నారు. రూ.కోట్లు దోచి పెట్టేందుకే పని చేస్తున్నారు. మా ఎమ్మెల్యే సీఎం అయితే మాకు మంచి చేస్తారని కొడంగల్ ప్రజలు ఆశించారు. కానీ రేవంత్ ప్రజల కోసం పని చేయడం లేదు. భూములు గుంజు కోవాలనేదే ఆలోచన. రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా..? అని ప్రశ్నించారు.