ఆదిలాబాద్ లో రైతుపై లాఠీచార్జి ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నల పైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు.
ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే అన్నారు. రాష్ట్రంలో రైతన్నల సమస్యలపైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నల పైన లాఠీచార్జ్ చేసిన అధికారుల పైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వం దాడులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.