తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలను ఆలయాల నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక తెల్లవారు జాము నుంచే శైవాలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ భక్తులు రుద్రాభిషేకాలు చేస్తున్నారు.
ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు శుక్రవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు తెలంగాణలోని వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో కోడెల మొక్కులు చెల్లించుకుంటున్నారు.