SLBC టన్నెల్ ప్రమాదం పై తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. ప్రమాదం పై అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలింది.
ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. గమనించిన తోటి కార్మికులు వారిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో ఏడుగురు కార్మికులు చిక్కుకున్నారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ఉదయం షిప్ట్ లో పనులకు 50 మంది కార్మికులు వెళ్లగా.. 43 మంది కార్మికులు బయటకు వచ్చారు.