కాంగ్రెస్ తరచూ సీఎంలను మారుస్తుందనేది దుష్ప్రచారం : మల్లికార్జున ఖర్గే

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దిల్లీ నేతల కనుసన్నల్లో పాలన సాగుతుందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారమంతా.. ఓటర్లను పక్కదారి పట్టించడానికేనని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ దిల్లీ నుంచి పాలిస్తుందని కేసీఆర్‌ భావిస్తే… జాతీయ పార్టీ పేరిట బీఆర్ఎస్​ను ఎందుకు స్థాపించారని ప్రశ్నించారు. అయినా కేసీఆర్​లా నియంతలా ఒక్కరే పాలించడం సరైంది కాదన్న ఖర్గే.. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని.. అందుకే అందరి సంప్రదింపులతో నడుస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు వెల్లడయ్యాక ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత పరిశీలకులను తెలంగాణకు పంపి, వారి అభిప్రాయాలను తీసుకుని ఏకాభిప్రాయం వచ్చాక సీఎం ఎవరో అధిష్ఠానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.

కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులను తరచూ మారుస్తుందన్నది ఇతర పార్టీల దుష్ప్రచారం మాత్రమేనని ఖర్గే స్పష్టం చేశారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అయిదేళ్లూ ఒకే సీఎం కొనసాగారన్న ఖర్గే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌, కర్ణాటకలో సిద్ధరామయ్యలు రెండుసార్లు ముఖ్యమంత్రులైన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో డబ్బుతో విజయం సాధించడం సాధ్యం కాదని వేవ్‌ అనేది వస్తే ఏ కారణాలు లేకుండానే పార్టీ గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ గాలిని అడ్డుకోలేరని ఖర్గే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news