తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయల ఫకీర్ లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని పేర్కొన్నారు. హామీల అమలులోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అవుతుందని.. కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్న జీవి అని మండిపడ్డారు.
ఇతర పార్టీలు బలహీనపడితే కాంగ్రెస్ కి బలం అని అన్నారు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ గెలుస్తుందని విమర్శించారు. బీజేపీ నేరుగా పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇంత వరకూ గెలవలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. తెలంగాణకు పన్నుల కింద లక్షా 60 వేల కోట్ల సాయం కేంద్రం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ మూడు వందేభారత్ రైళ్లు కూడా మంజూరు చేసిందని అన్నారు. హైవేల కింద ఐదు భారత్ మాల ప్రాజెక్టులు ఇచ్చినట్లు చెప్పారు.