అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆమె పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న బీఎస్పీ ర్యాలీ, బహిరంగ సభలో మాయావతి పాల్గొననున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు మాయావతి సభకు చేరుకుంటారని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష వెల్లడించారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలితో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవనున్నట్లు పేర్కొన్నారు. మాయావతి రాక నేపద్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభకు హాజరైన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టెంట్లు సైతం ఏర్పాటు చేసినట్లు నేతలు పేర్కొన్నారు.
మరోవైపు బుధవారం రోజున రాష్ట్రానికి వచ్చిన మాయావతి సూర్యాపేటలో నిర్వహించిన బీఎస్పీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్, కాన్షీరామ్ కన్న కలలను ప్రజలు సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తర్ప్రదేశ్ తరహాలో తెలంగాణలో బీఎస్పీని ఆదరించాలని కోరారు. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా.. వాటిని అమలు చేయట్లేదని విమర్శించారు.