ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారలమ్మ తల్లుల జాతర సమీపిస్తుండడంతో ముందస్తుగా మేడారంలో భక్తులు తాకిడి పెరుగుతోంది. ఆదివారం రోజున వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారింది.
భారీగా తరలివచ్చిన భక్తుల ప్రైవేటు వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. పోలీసులు తాడ్వాయి మీదుగా మేడారానికి వాహనాలను మళ్లించారు. వచ్చే నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జాతర జరగనున్న విషయం తెలిసిందే. జాతరకు ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారు. లక్షల మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు.
మరోవైపు జాతర నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 6వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. జాతరకు ముందుగానే భక్తులు పొటెత్తుతున్న తరుణంలో 18వ తేదీ నుంచి 25 వరకు బస్సులు నడపాలని ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.