పేదింటి ఆడపిల్లల వివాహాలకు లక్ష నగదు పంపీణీతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హామీ అమలుపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కళ్యాణమస్తు, షాదీ మబారక్ పథకాల అమలుపై సంక్షేమ శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.
తులం బంగారం అదనంగా చేర్చిన నేపథ్యంలో పథకం ఖర్చు ఎంత అవుతుందోనన్న విషయంపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. దాదాపు 50 శాతానికి పైగా ఖర్చు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనాకు వచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గత ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకానికి బడ్జెట్‌లో రూ.3,210 కోట్లు కేటాయించగా.. వచ్చే ఈ ఏడాది ఈ ఖర్చు రూ.5 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ప్రస్తుత ఏడాదికి రూ.260 కోట్ల బడ్జెట్ ఉంది. ఇది వచ్చే ఏడాదికి రూ.400 కోట్ల వరకు చేరనున్నట్లు సమాచారం. బీసీ సంక్షేమశాఖలో అంచనాలు రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్లకు చేరుకోనున్నాయి.