గత రెండ్రోజులుగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్పై పోటీ చేయనున్నట్లు ఇటీవల ఈటల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దమ్ముంటే కేవలం ఒకేచోట.. అది కూడా గజ్వేల్లోనే పోటీ చేయాలని ఈటలకు గంగుల సవాల్ విసిరారు. ఈ క్రమంలో గంగులపై, కేసీఆర్పై ఈటల విరుచుకుపడ్డారు. తాజాగా ఈటల వ్యాఖ్యలపై గంగుల స్పందించారు.
కేసీఆర్పై విమర్శలు చేస్తున్న ఈటల రాజేందర్.. దమ్ముంటే ఈసారి ఎన్నికల్లో గెలిచి చూపించాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కేసీఆర్ ఇచ్చే బీఫారం.. భగవద్గీతతో సమానమని అన్నారు. భీఫారం ఇచ్చి తనను ఓడించే యత్నం చేశారని.. ఈటల రాజేందర్ అభాండాలు వేయడం సరికాదని సూచించారు. 2018లో కేసీఆర్ బొమ్మతో గెలిస్తే.. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుమ్ముక్కై రాజకీయాలు చేసి గెలిచారని గంగుల ఆరోపించారు.
మరోవైపు గజ్వేల్‌లో బీజేపీకి ఓటు వేసి కేసీఆర్‌ను ఓడించాలని ప్రజలు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ డబ్బులతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని… ఎమ్మెల్యే అభ్యర్థులకు పోలీసు పహారాలో ఇప్పటికే డబ్బులు పంపించారని ఆరోపించారు.