జాకీలు పెట్టినా తెలంగాణలో బీజేపీ లేవదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో లోక్‌పోల్ సర్వే కలకలం రేపింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే అంచనా వేసింది. దీనిపై బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు స్పందించారు.
కాంగ్రెస్ టికెట్లను అమ్ముకుంటుంది. కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చేస్తుంది. ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నారు.. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణను కూడా అమ్ముకుంటుంది. గాంధీ భవన్‌లో మొన్నటిదాకా దరఖాస్తులను కూడా అమ్ముకున్నారని.. ఇప్పుడు సీట్లు అమ్ముకుంటున్నారని హరీశ్ ఆరోపించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. మరోవైపు బీజేపీ రైతులకు బావుల వద్ద.. బోర్లకు మీటర్లను పెట్టమంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదు.. అలాంటి వారికి ఓట్లు వేద్దామా అని ప్రశ్నించారు.