విద్యార్థులు ఉద్యోగాల కోసం వెంపర్లాడటం మానేసి.. ఉద్యోగాలు సృష్టించడంపైన ఫోకస్ చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రారంనాడు హనుమకొండ లో పర్యటించిన మంత్రి.. ఎర్రగట్టు గుట్టలోని కిట్స్ కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం కిట్స్ కళాశాల విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముఖాముఖిలో పాల్గొన్నారు.
దేశం అభివృద్ధి చెందాలంటే.. సమూల మార్పులు రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దని.. ఉద్యోగాలు సృష్టించాలని కిట్స్ విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంత విద్యార్థులు చిన్న చిన్న నూతన పరికరాలను సృష్టిస్తూ ప్రశంసలు పొందుతున్నారని వివరించారు.
‘ప్రపంచంలో జపాన్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం. జపాన్‌లో అణుబాంబు విస్ఫోటనం జరిగినా అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందాలంటే.. సమూల మార్పులు రావాలి. చదువు పూర్తయ్యాక నాలుగైదేళ్లు పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు యత్నించండి. మీరు ఎదిగేందుకు టీ హబ్, వీ హబ్ వంటి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేశాం. మన అనుభవాల నుంచి ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు. అవసరాలే ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయి.’-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి