కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎందరో నేతలు కలిసి వస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడంలో తెలంగాణ కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొంగులేటి ప్రసంగించారు. అభయహస్తంలోని ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల దోపిడీని శ్వేతపత్రాలుగా ప్రజల ముందు ఉంచాం. ప్రజలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాం. కాంగ్రెస్ వచ్చేది లేదు.. ఇచ్చేది లేదు అని వెటకారంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. ఖాజానా ఖాళీ ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. ఆర్థిక క్రమశిక్షణతో పని చేస్తూ.. నిధులు సమకూర్చుకుని ప్రజలకు మేలు చేస్తున్నాం.” అని మంత్రి పొంగులేటి అన్నారు.