ఇందిరమ్మ ఇళ్లు పథకంపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత స్థలాలు ఉన్న పేదలకు ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత విడతలో ఇంటి స్థలం అందజేస్తామని వెల్లడించారు. అందులో కూడా ఎవరి ఇళ్లు వారే నిర్మించుకుంటారని.. వారికి నిధులను నిర్దేశించిన సమయంలో విడతల వారీగా విడుదల చేస్తామని వివరించారు.
“మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500కు తగ్గకుండా ఇళ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. మౌళిక వసతులు లేకుండా, నిరుపయోగకరంగా ఉన్న వేలాది ఇళ్లను కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో భేషజాలకు పోకుండా వాటికి కావాల్సిన నిధులు సైతం సమకూర్చాం. గతంలో మాదిరిగా ఇరవై, ముప్పై ఫ్లోర్లలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అనుకోవటం లేదు. పరిమిత లెవల్లో మాత్రమే స్థలాన్ని అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించాం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.