తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి సీతక్క. RTC బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్..? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
ఆడవాళ్ళంటే KTRకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. భేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం. గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాము. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి..? ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే… వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గం. మహిళలు పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును నేను ఖండిస్తున్న అని తెలిపిన సీతక్క.. తెలంగాణ మహిళలకు కేటీఆర్, బీఆర్ఎస్ క్రమాపణ చెప్పాలి అని పేర్కొన్నారు.