బ్యాలెట్‌పై తన ఫొటో చిన్నగా ఉందని.. అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా

-

ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆందోళన బాట పట్టారు. తమ నియోజకవర్గ అభ్యర్థుల ఈవీఎం బ్యాలెట్‌ పత్రంలో తన ఫొటో చిన్నగా ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ధర్నాకు దిగినట్లు సీతక్క తెలిపారు.

విషయం తెలుసుకున్న ములుగు ఎస్సై వెంకటేశ్వర్‌ అక్కడికి చేరుకొని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వారు అక్కడి నుంచి కదిలేదే లేదని భీష్మించుకు కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి అంకిత్ సీతక్క మరో ఫొటోను ఇస్తే బ్యాలెట్​పై పొందు పరుస్తామని హామీ ఇవ్వగా.. సీతక్క వెంట ఉన్న కాంగ్రెస్ శ్రేణులు వెంటనే ఆమె ఫొటో తీసుకువచ్చి ఎన్నికల అధికారికి సమర్పించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రిటర్నింగ్ అధికారి హామీ స్పష్టంగా లేదని కాంగ్రెస్ శ్రేణులు నిరసన కొనసాగించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు నిరనస సాగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version