స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఈ ఏడాది కూడా బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ఆశపడి భంగపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరిని కేసీఆర్ ప్రకటించడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఆ అసంతృప్తిని బహిరంగంగానే చూపిస్తూనే.. కచ్చితంగా తనకు టికెట్ వస్తుందనే ఆశతోనే ఉన్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా రైతుబంధు సమితి అధ్యక్షుడిగా అధిష్ఠానం పదవి కట్టబెట్టింది. తాజాగా ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు.
అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ టికెట్‌పై ఆశాజనకంగానే ఉన్నానని తాటికొండ రాజయ్య తెలిపారు. ప్రజాభిమానం తనకే ఉందని చెప్పారు. దానిని సర్వేలు, ఇతర నివేదికల ద్వారా అధిష్ఠానం తెలుసుకుని నిర్ణయం మార్చుకుంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ తనపై ఉన్న నమ్మకంతో రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌గా నియమించారని తెలిపారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వారి బాగోగుల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా కొనసాగాలని కోరుకుంటున్నారని.. నియోజకవర్గంలో ప్రజాభిప్రాయాన్ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నానని మరోసారి తాటికొండ రాజయ్య అన్నారు.