అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. తెలుగోని సత్తా చాటడమంటే ఇలా కాదని.. సంధ్య థియేటర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సానుభూతి చూపించాలన్నారు. సంధ్య థియేటర్ ఘటన లో ఒకరి ప్రాణాలు కోల్పోయిన దానిపై అసెంబ్లీలో ప్రస్తావించాక మీరు పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెట్టారని అనుకున్నామని తెలిపారు. కానీ అందుకు విరుద్ధంగా మాట్లాడటం సరికాదన్నారు. మీరు ఆరోజు థియేటర్ నుంచి ఎలా వెళ్లారో ఎప్పుడు వెళ్లారో అన్ని వీడియోలు ఉన్నాయని.. అయినప్పటికీ మీరు ప్రెస్ మీట్ లో మనిషి చనిపోయిన విషయం తరువాత రోజు దాకా తెలియదని అబద్దాలే చెప్పారన్నారు.
థియేటర్ లో ఎంత సేపు మీరు సినిమా చూశారు.. కారు నుంచి అభివాదం చేస్తూ చేసిన రోడ్డు షోకి సంబంధించిన వీడియోలు క్లియర్ గా ఉన్నాయని గుర్తు చేసారు. రేవతి మరణించిన ఘటన తరువాత రోజు కూడా మీరు మీ ఇంటి దగ్గర టపాసులు కాల్చారని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెబుతూ ప్రజా ప్రభుత్వం తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవు అని ప్రజలకు భరోసానిస్తూ.. అసెంబ్లీలో మాట్లాడిన తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.