దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న కవిత కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు సీబీఐ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ మూడ్రోజుల సీబీఐ కస్టడీలో కవితను అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం.
మరోవైపు కవితను కస్టడీకి కోరే సమయంలో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లో కీలక విషయాలు పేర్కొంది. మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని, విజయ్ నాయర్, తదితరులతో కలిసి పథకం రూపొందించారని కోర్టుకు తెలిపారు. అందుకు దిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిగాయని చెప్పారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఆమె పాత్ర స్పష్టంగా ఉందని చెప్పారు. రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారని వివరించారు.
మరోవైపు దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆదివారం ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు. సాయంత్రం 6 నుంచి ఏడున్నర గంటల వరకు ఆమెతో మాట్లాడారు.