గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా ఈసీ పర్యవేక్షించనుంది. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే స్పందించి సరిదిద్దేందుకు అనువుగా పెద్ద సంఖ్యలో ఇంజినీర్లను అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. సీఈఓ కార్యాలయంతోపాటు ఈసీ నుంచి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే అవసరాలతో పాటు 10 శాతం అదనంగా సిద్ధం చేసి ఉంచారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 2వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు.