హైదరాబాద్‌లో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అస్తవ్యస్తమైపోయింది. ప్రజల జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా మంగళవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇంటి నుంచి అడుగు బయటకు కూడా పెట్టలేదు. భారీ వర్షాలకు నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
మరోవైపు భాగ్యనగరంలో రెండ్రోజులుగా కురిసిన వానకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నదికి వరద పోటెత్తింది. బీబీ నగర్ మండలం రుద్రవెల్లి , భూదాన్ పోచంపల్లి మండలం జూలురు గ్రామాల మధ్య లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసి ఉద్దృతంగా ప్రవహిస్తోంది. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల్ వంతెనపై నుంచి వరద ప్రవాహంతో.. వలిగొండ మండలం సంగెం, భువనగిరి మండలం బోల్లేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండుచోట్లా పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులు అటుగా వెళ్లకుండా చూస్తున్నారు. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అత్యవసర పనులకు కూడా వెళ్లలేకపోతున్నారు. వర్షాలు పడిన ప్రతిసారి తమకు ఈ ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు.